Saturday, October 3, 2026

సబ్ జైలు పరకాలలో ఘనంగా గాంధీ జయంతి

పరకాల, అక్టోబర్ 2 (పిసిడబ్ల్యూ న్యూస్): పరకాల సబ్‌జైలులో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జైలు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ఫస్ట్‌క్లాస్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ సాయి శరత్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వంశీకృష్ణ, ఆర్‌ఎంవో బాలకృష్ణ, ఏజీపీ శ్రీనివాస్, న్యాయవాది రాజమౌళి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పర్యవేక్షణ అధికారి ఎన్. ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. గాంధీజీ బోధించిన సత్యం, అహింస, క్షమ, మానవతా విలువలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. జైలులో గడిపే కాలాన్ని కేవలం శిక్షగా కాకుండా, గత తప్పిదాలను గుర్తించి జీవితాన్ని మార్చుకునే అవకాశంగా భావించాలని తెలిపారు. జైలు నుంచి విడుదలైన అనంతరం బాధ్యతాయుతమైన, గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించేందుకు ప్రతి ఖైదీ కృషి చేయాలని ఆకాంక్షించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. కోపావేశం, తొందరపాటు నిర్ణయాలతో జరిగే ఒక్క తప్పిదం వ్యక్తి జీవితంతో పాటు కుటుంబ సభ్యులు, పిల్లలు, బంధువులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. ఇకపై చట్టాన్ని గౌరవిస్తూ క్రమశిక్షణతో జీవించాలని సూచించారు. జైలు అనేది కేవలం శిక్షించే ప్రదేశం మాత్రమే కాకుండా, వ్యక్తిలో మార్పు తీసుకొచ్చి సమాజంలో బాధ్యతాయుతమైన పౌరుడిగా తీర్చిదిద్దే వేదికగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఖైదీలు విద్య, వృత్తి నైపుణ్యాలు, ఆరోగ్యం, సత్ప్రవర్తనపై దృష్టి సారించి, విడుదల అనంతరం సమాజంలో గౌరవప్రదమైన జీవితం కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో జైలు సిబ్బంది, ఖైదీలు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles