పిసిడబ్ల్యూ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ల సహకారంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్‌లో భాగంగా స్క్రీనింగ్ టెస్ట్‌లో ఉత్తీర్ణులైన 560 మంది అభ్యర్థులకు శిక్షణా తరగతుల నిర్వహణపై ముందస్తు సమావేశం భీమారంలోని మంగళవారం రోజు శుభం ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ మాట్లాడుతూ, గతంలో నిర్వహించిన ఉచిత కోచింగ్ ద్వారా పలువురు పోలీస్ ఉద్యోగాలు సాధించారని తెలిపారు. ప్రణాళికాబద్ధంగా కష్టపడి, క్రమశిక్షణతో చదివితే విజయం సాధించవచ్చని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మధ్యవర్తులను నమ్మి డబ్బులు చెల్లించి మోసపోవద్దని సూచించారు. అభ్యర్థులు కోచింగ్‌ను సద్వినియోగం చేసుకొని క్రమం తప్పకుండా తరగతులకు హాజరై ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, అడిషనల్ డీసీపీ సురేష్, హనుమకొండ ఏసీపీ నరసింహారావు, కేయూసీ ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
