Wednesday, September 30, 2026

మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరి నిర్మూలనకు సమన్వయంతో పనిచేయాలి: ఆర్డీఓ డి.ఎస్. వెంకన్న

పరకాల, సెప్టెంబర్ 29 (పిసిడబ్ల్యూ న్యూస్): మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరి, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) డి.ఎస్. వెంకన్న సూచించారు. మంగళవారం పరకాల ఆర్డీఓ కార్యాలయంలో ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ, హనుమకొండ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, కార్మిక శాఖల అధికారులకు మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరి నిర్మూలనపై సమీక్ష, సామర్థ్య నిర్మాణ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ డి.ఎస్. వెంకన్న అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు చెందిన ప్రజలను ప్రలోభాలకు గురిచేసి మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల ఆర్థిక, సామాజిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని వారిని వెట్టిచాకిరీలోకి నెట్టే ఘటనలను అరికట్టాలని సూచించారు. బాధితులను గుర్తించి వారికి అవసరమైన సహాయం అందించడంతో పాటు, నేరాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పరకాల డివిజన్ పరిధిలోని ప్రతి మండలంలో మానవ అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ, వెట్టిచాకిరి నిర్మూలనకు శాఖల మధ్య సమన్వయం మరింత పెంచాలని ఆర్డీఓ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు త్వరలో డివిజన్ స్థాయిలో విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేసి, కమిటీ ద్వారా ఈ నేరాల నియంత్రణకు సమగ్ర చర్యలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ (ఐజేఎం), హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ఆనంద్ రిసోర్స్ పర్సన్‌గా పాల్గొని మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరి నిర్మూలనకు సంబంధించిన అంశాలపై అధికారులకు అవగాహన కల్పించారు. ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్లు ఎర్ర శ్రీకాంత్, ఇక్బాల్ పాషా, డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్లు, కార్మిక శాఖ అధికారి వినోద్ కుమార్, వరంగల్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఎస్‌ఐ సుధాకర్, ఎఫ్‌ఎంఎం సిబ్బంది నరసింహస్వామి, రాకేష్, ప్రదీప్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles