పరకాల, సెప్టెంబర్ 29 (పిసిడబ్ల్యూ న్యూస్): పరకాల పట్టణంలోని 21వ వార్డు జయ డీలక్స్ రోడ్డుకు ఎడమవైపు ఉన్న గల్లీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 25 రోజులుగా నడిరోడ్డుపైనే భారీగా కంకర, ఇసుక కుప్పలను పోసి ఉంచడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గల్లీ ఇరుకుగా ఉండటంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక, కంకర కుప్పలు రోడ్డును ఆక్రమించడంతో వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్ తదితర వాహనాలు సైతం రాకపోకలు సాగించడం కష్టంగా మారే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులుగా సమస్య కొనసాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల కాలనీవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్డుపై ఉన్న ఇసుక, కంకర కుప్పలను తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా రహదారులను ఆక్రమించి నిర్మాణ సామగ్రి నిల్వ చేయకుండా సంబంధిత అధికారులు పర్యవేక్షణ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
