Saturday, September 26, 2026

రాయపర్తి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం

నడికూడ, సెప్టెంబర్ 25 (పీసిడబ్ల్యు న్యూస్): నడికూడ మండలంలోని రాయపర్తి సెక్టార్ పరిధిలోని రాయపర్తి గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు సూపర్‌వైజర్ కె. శ్రీదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాయపర్తి గ్రామ సర్పంచ్ తంగేళ్ల రాజా జగత్ ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు వంటి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని నిత్యం తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించే పోషణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిన్నారులకు ప్యాకెట్ ఫుడ్, కూల్‌డ్రింక్స్ వంటి వాటికి బదులుగా ఇంట్లోనే తయారు చేసిన పోషక విలువలున్న ఆహార పదార్థాలను అందించాలని సూచించారు. సూపర్‌వైజర్ మాట్లాడుతూ.. సమతుల్యమైన పోషకాహారం తీసుకోవడం ద్వారా చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలను మెరుగుపరచవచ్చన్నారు. మనకు అందుబాటులో ఉన్న ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని అర్హులైన వారికి తప్పనిసరిగా అందించి, చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా పోషణ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గ్రామ బాలల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సుజాత, సూపర్‌వైజర్ హరీష్ గ్రామ పంచాయతీ కార్యదర్శి సంధ్య, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles