పరకాల, సెప్టెంబర్ 25 (పిసిడబ్ల్యూ న్యూస్): పరకాల పట్టణంలోని ప్రధాన రహదారి దుస్థితి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. నిత్యం బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, ప్రైవేట్ వాహనాలు రాకపోకలు సాగించే రహదారిపై భారీ గోతులు ఏర్పడి వర్షపు నీటితో ప్రమాదకరంగా మారాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గోతుల్లో నీరు నిలిచిపోవడంతో అవి ఎంత లోతుగా ఉన్నాయో వాహనదారులకు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో ద్విచక్ర వాహనదారులు అప్రమత్తంగా వెళ్లాల్సి వస్తోంది. చిత్రంలో కనిపిస్తున్న గోతిని చూస్తే రహదారి నిర్వహణ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. గోతిలో నీరు నిలవడంతో పాటు చుట్టుపక్కల రోడ్డు కంకర తేలిపోయి వాహనాలు అదుపుతప్పే ప్రమాదం కనిపిస్తోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ గోతులు వాహనదారులకు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. బస్సులు, భారీ వాహనాలు ఈ మార్గంలో ప్రయాణించే సమయంలో రహదారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది. ప్రధాన రహదారిపై మరమ్మతులు చేపట్టి కొంతకాలానికే మళ్లీ గోతులు ఏర్పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఏడాదిలో పలుమార్లు మరమ్మతులు చేస్తున్నప్పటికీ రహదారి సమస్య శాశ్వతంగా పరిష్కారం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలికంగా కంకర, మట్టి పోసి గోతులను పూడ్చడం, కొద్దిరోజులకే మళ్లీ అవే గోతులు ఏర్పడటం పరిపాటిగా మారిందని స్థానికులు అంటున్నారు. ప్రజాధనం ఖర్చు చేసి మరమ్మతులు చేస్తున్నా.. రహదారి పరిస్థితి మాత్రం మారకపోవడంపై అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రహదారి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా? మరమ్మతులు పూర్తయిన తర్వాత అధికారులు నాణ్యతను పరిశీలిస్తున్నారా? వర్షాలకు ముందే ప్రమాదకర గోతులను గుర్తించి శాశ్వత పరిష్కారం ఎందుకు చూపడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రధాన రహదారిపై ఏర్పడిన గోతులను పరిశీలించి, తాత్కాలిక పూడ్చివేతలకు పరిమితం కాకుండా వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
