పరకాల, సెప్టెంబర్ 24 (పిసిడబ్ల్యూ న్యూస్): పరకాల: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరకాల నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సూచించారు. వర్షాల కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకరాదని సూచించారు. మ్యాన్‌హోల్స్, డ్రైనేజీలను గమనిస్తూ నడవాలని, ఉద్ధృతంగా ప్రవహించే వాగులు, చెరువులు, కాలువల వద్దకు వెళ్లకూడదని హెచ్చరించారు. వ్యవసాయ పనులు చేసే సమయంలో విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పాత గోడలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించే వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ప్రజలు బయటకు వెళ్లకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కోరారు. అధికారులు, సిబ్బంది సూచనలను ప్రజలు పాటిస్తూ వర్షాల సమయంలో పూర్తి అప్రమత్తతతో ఉండాలని ఆయన సూచించారు.
